మహిళల స్వయం సమృద్దే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం..

59
- Advertisement -

సిద్దిపేట పట్టణం, రెడ్డి ఫంక్షన్ హల్ లో భారతీయస్టేట్ బ్యాంకు సిద్ధిపేట రీజియన్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు లోన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టి ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్ ల ఉద్దేశ్యం అన్నారు. జిల్లాలో ఒకే గ్రూపుకు 20 లక్షల లోన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవ్వడం హార్షనీయం. 10 ఏళ్ల క్రితం ఒక మహిళ సంఘం గ్రూపుకు 50,000 లు ఇవ్వాలంటే బ్యాంకర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. SHG మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టి ఆర్థికంగా ప్రగతి బాట పట్టడం ద్వారా బ్యాంకర్లకు స్వయం సహాయక సంఘాలపై నమ్మకం పెరిగింది. ఫలితంగా బ్యాంకర్లే స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టి బ్యాంకర్లు ఇచ్చే రుణాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టాలని మహిళలకు సూచించారు మంత్రి.

ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో తొక్కుల విక్రయాలకు ఈర్కోడ్, పప్పులకు మిట్టపల్లి ప్రసిద్ధి చెందాయి, వాటి నిర్వహణ బాధ్యతలు మహిళలే చూస్తున్నారు. కొంతమంది మహిళలు చేతి బ్యాగులు, మాస్కుల వంటి స్వయం ఉపాధి పథకాలను చేపట్టి రాణిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో నీటి లభ్యత పెరిగి పాడి పశువుల పెంపకానికి గ్రామాలు అనువుగా మారాయి. పాడి యూనిట్లను స్థాపించడం ద్వారా ఆర్థికంగా ఎదిగే ఆస్కారము మహిళలకు ఉందన్నారు. మహిళలు ఉమ్మడిగా సూపర్ మార్కెట్ వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను కూడా చేపట్టి విజయం సాధించవచ్చని మంత్రి తెలిపారు.

తెలంగాణ SHG లు దేశానికే ఆదర్శం..
తెలంగాణ స్వయం సహాయక సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే స్థాయికి మన మహిళా సంఘాలు ఎదగడం మనందరికీ గర్వకారణం. బ్యాంకర్ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో మన స్వయం సహాయక బృందాలు ముందున్నాయి. 99 శాతం రుణాల రికవరీ ఉండడం వల్లే ఈరోజు బ్యాంకర్లు రుణాలను విరివిగా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. సెర్ప్ మెప్మా ఉద్యోగులు సైతం స్వయం సహాయక సంఘాలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వారు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టేలా చూడాలి. స్వయం సంఘాల పనితీరు మరింత ప్రభావంతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదే అన్నారు.

వడ్డీలేని రుణాలను అందజేస్తాం..
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. అభయ హస్తం డబ్బులను ఎల్ఐసి ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది, వాటిని మిత్తితో సహా సంబంధిత మహిళలకు అందజేస్తాం. అలాగే వచ్చే రెండు మూడు నెలల్లోగా అర్హులకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము.

పంటరుణాలను రెన్యూవల్ చేయాలి..
రైతులు తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను రెన్యువల్ చేయాలని స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగానియాను కోరడం జరిగింది.

ప్రభుత్వ ప్రత్యేక చొరవతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..
జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు SBI హైదరబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగానియాకు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ప్రజల తలసరి ఆదాయం రూ .1.24 లక్షలుగా ఉందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021-22 నాటికి అది రూ .2.78 లక్షలకు పెరిగింది. 2014-15లో జీఎస్టీపీ రూ.4.16 లక్షల కోట్లుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 130 శాతం పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలో 11 వ స్థానంలో ఉన్న తెలంగాణ , ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. వ్యవసాయం , నీటిపారుదల రంగాలలో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.. రైతు బంధు , రైతు బీమా , వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, గొర్రెల పంపిణీ మిషన్ కాకతీయ వంటి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని మంత్రి తెలిపారు. గ్రామీణ సంపద గణనీయంగా పెరిగిందన్నారు. గ్రామాల్లో సైతం భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. రెండు మూడు ఎకరాలు ఉన్నోళ్లు నేడు కోటీశ్వరులని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంకు నియోజకవర్గంలోనీ 120 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజి క్రింద రూ. 10 కోట్లు అందజేసింది.. సిద్దిపేట పట్టణంకు చెందిన 41 స్వయం సహాయక సంఘాలకు 5 కోట్ల వడ్డీ లేని రుణాలను ఎస్బిఐ అందజేసింది. అలాగే సిద్దిపేట మెదక్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద 11.5 కోట్లను అందజేసింది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారతీయ స్టేట్ బ్యాంక్ ట్రాఫిక్ జంక్షన్ లలో సీసీటీవీల ఏర్పాటు కోసం సిద్ధిపేట సిపికి పది లక్షల రూపాయలను అందజేసింది. సంబంధిత చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు అందజేశారు.

అదేవిధంగా సిద్దిపేట టు చెందిన లలితా పరమేశ్వరి ఇండస్ట్రీస్ కు 10 కోట్ల రుణ మద్దతు శ్రీ హరి సాయి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఐదు కోట్ల రుణ మద్దతు సాంక్షన్ లెటర్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేసింది. అలాగే పలు స్వయం సహాయక సంఘాల గ్రూప్ లకు ఒక్కో గ్రూప్ కు రూ.20 లక్షల రుణాలను మంత్రి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ ,మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మంజుల రాజనర్సు, అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, జనరల్ మేనేజర్ చంద్రకాంత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, drdo శ్రీ గోపాల్ రావు , బ్యాంక్ మేనేజర్ లు, SHG మహిళలు తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -