గత కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని తేల్చిచెప్పారు. ఆరు నూరైనా ముందస్తుకు పోయే ప్రసక్తే లేదని, గతంలో అవసరం మేరకే ముందస్తుకు వెళ్లామని కేసీఆర్ తెలిపారు. సోమవారం టీఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
అలాగే తమ పార్టీ కోసం పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డబ్బులు తీసుకుని పనిచేసే రకం కాదని పేర్కొన్నారు. గడచిన 8 ఏళ్లుగా తనకు పీకేతో స్నేహం ఉందని, తన కోరిక మేరకే టీఆర్ఎస్ కోసం పీకే పనిచేస్తున్నారని కేసీఆర్ చెప్పారు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బలం తగ్గుతుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. గతంలో 312 సీట్లు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 255 సీట్లకే పరిమితమైందన్నారు. సీట్ల తగ్గుదల దేనికి సంకేతమో బీజేపీనే ఆలోచించుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.