స్వాతంత్ర సమరయోధురాలు,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
మల్లు స్వరాజ్యం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు.