నిర్మల్ జిల్లాలోని 735 పాఠశాలలలో 1346 మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రభుత్వం రూ. లు 1000 నుండి 3000 కు వేతనం పెంచిందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య తోనే అభివృద్ధి సాధ్యమని, అందరూ మంచి చదువులు చదువుకొని అభివృద్ధి చెందాలని కోరారు. జిల్లాలో 250 పోస్టులు పోలీస్ శాఖకు రానున్నందున అధికారులు యువతకు మంచి శిక్షణ ఇచ్చి పోలీసు ఉద్యోగాలు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. అంతేగాక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ ప్రక్రియ పూనుకున్నందున యువత వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు దక్కించుకోవాలన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత బందు పథకం కింద అధికారులు,లబ్ధిదారులకు డిమాండ్ ను అనుసరించి మంచి యూనిట్లు ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామం అని అన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు సంభవించకుండా క్రాష్ బారికేడ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఈఈ, ఆర్ అండ్ బి శాఖలను ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు.
నిర్మల్ csr లో రూ. లు 1కోటి 45 లక్షలతో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నార్మన్ డెలివరీ ల విషయంలో నిర్మల్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, పి. రాంబాబు, భైంసా అడిషనల్ ఎస్పీ కిరణ్ కారే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.