రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా రూ. 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకం పైలాన్‌ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్ పట్టణానికి అర పైసా పని కూడా చేయని బండి సంజయ్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ స్టేటస్ కరీంనగర్‌కు వచ్చింది. గెలిచి మూడేండ్లు అయింది. కనీసం కరీంనగర్ పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు. దమ్ముంటే చెప్పాలి. కరీంనగర్‌కే కాదు.. సిరిసిల్ల నేతన్నలకు పవర్ లూమ్ కస్టర్ ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారు. చొప్పదండికి కూడా ఏం చేయలేదు. కాళేశ్వరం ద్వారా పూర్వ కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా ఇప్పియ్యలేదు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కనీసం పార్లమెంట్‌లో కూడా మాట్లాడలేదని కేటీఆర్ మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఒక మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ రాలేదు. చివరకు పాలిటెక్నిక్ కాలేజీ కూడా తేలేదు. పొద్దున్నే లేస్తే హిందూ ముస్లిం అంటారు. ఒక గుడి కూడా తేలేదు. ఏం చేతకాదు. కేసీఆర్‌ను తిట్టడం, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. చేనేత సముహాలు, బ్లాక్ లెవల్ క్లస్టర్ ఇవ్వాలని కోరితే కూడా తెప్పించలేదు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అర పైసా పని కూడా చేయలేదు. బూతులు తిట్టడం తప్ప మంచి చేసిందేమీ లేదన్నారు.
పిల్లల భవిష్యత్‌కు పనికొచ్చే పనికి ఒకటి కూడా చేయలేదు. పనికిమాలిన మాటలతో కడుపు నిండదు. మతము అనే పిచ్చి కడుపు నింపదు. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. భారతదేశానికి బువ్వ పెట్టే మొదటి నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. బండి బాగా మాట్లాడుతున్నావ్.. దమ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువాలని సవాల్ విసురుతున్నా. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.