ఇవాళ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి బ్రహ్మాత్సవాల్లో భాగంగా జరిగే లక్ష్మీనారసింహుల కళ్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొననున్నారు సీఎం. ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం. కేసీఆర్ రాక సందర్భంగా ఆలయ అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అనంతరం మహాసుదర్శన యాగ స్థలం, అన్నదానం కాంప్లెక్స్, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్ పనులను సీఎం పరిశీలిస్తారు. అనంతరం ప్రధాన ఆలయం పునఃప్రారంభ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై వేద పండితులతో చర్చిస్తారు. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపైనా సీఎం చర్చించనున్నారు.