కమిషనర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఉద్యోగులు, అధికారులు రూపొందించిన పల్లె ప్రగతి 2022 డైరీని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు శాసన మండలి ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. ఈ రోజు పల్లెలు పచ్చగా ఉన్నాయంటే ఈ శాఖల అధికారులే కారణమన్నారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని, కేంద్ర అవార్డులు, రివార్డులు వస్తున్నాయన్నారు.
అంతేగాక మన తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా, తలమానికంగా నిలవడానికి కారణం కూడా అధికారులేనని మంత్రులు తెలిపారు. ప్రత్యేకించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అత్యంత నిబద్ధతతో అమలు చేశారన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని, కరోనా వంటి భయంకర వ్యాధులను సైతం ఎదుర్కోగలిగే స్థాయి పారిశుద్ధ్యాన్ని నిర్వహించారన్నారు. వారందనీ అభినందించారు. అంతేగాక పల్లె ప్రగతి పేరుతో డైరీని తేవడం, అందులో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలకు సంబంధించిన ఫోటోలు ఏర్చి కూర్చారని, ఇది వారి నిబద్ధతకు నిదర్శమని మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావులు అన్నారు.
అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనులు, నిధులపై మంత్రులు సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ పనులు, నిధులు, పెండింగ్ బిల్లులు వంటి పలు అంశాలపై రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించారు. ఈ మేరకు ఆ రెండు శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనుల పురోగతి, విడుదలైన నిధులు, ఇంకా పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి అంశాలను సమీక్షించారు. అలాగే ఈజీఎస్, కెజిఎస్ఎ, పిఎంకెఎస్‌వై తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు అయ్యే విధంగా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు ఇరు శాఖలకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.