నోట్ల సరఫరాకు భారతీయ రిజర్వు బ్యాంకు భారీఎత్తున కోత పెట్టిందా అంటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా సామాన్యులకు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయని జనం భావిస్తున్నారు. గతవారం రోజులుగా హైదరాబాద్‌లో ఏటీఎంలలో డబ్బులు లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుని గట్టిగా నెల రోజులు కూడా కాకుండా మళ్లీ దేశంలో నగదు లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని సామాన్యుడు వాపోతున్నాడు. డిసెంబరు నుంచి మార్చి నెల మధ్య ఏకంగా రిజర్వు బ్యాంకు నుంచి రావాల్సిన నగదు సరఫరాలో దాదాపు రూ.16,885 కోట్ల మేర కోత పడినట్లు సమాచారం. రిజర్వు బ్యాంకు అన్ని రాష్ట్రాలకు నోట్ల పంపిణీలో భారీ కోత విధించినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా నోట్ల సరఫరా ఆగిపోవడంతో రాష్ట్రంలోని ఏటీఎంలన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి.
ఇది చాలదన్నట్లు బ్యాంకులు ఛార్జీల పేరుతో నిలువు దోపిడీకి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రజలు పోస్టాఫీసుల వైపు మళ్లుతున్నారు. ఎందుకంటే ఏ ఛార్జీలు లేకుండా నగదు సేవలు అందించడమే ఇందుకు కారణం. దీంతో ఇంతకాలం పట్టించుకునేవారు లేక ఆదరణ కోల్పోతున్న పోస్టాఫీసులకు మళ్లీ గిరాకీ మొదలైంది.
రోజుకో రూలుతో ప్రజలను పీడించుకు తినడానికి సిద్ధమవుతున్న బ్యాంకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పోస్టాఫీసుల్లో వంద రూపాయలకే ఖాతా తెరిచే వీలుండడంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పోస్టాఫీసులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కొత్త ఖాతాలతో కళకళలాడిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకు 5 లక్షలకు పైగా సేవింగ్ అకౌంట్లు ఉన్నాయి. కేవలం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఖాతాలు తెరిచారట.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు కేవైసీ నియమాలను పాటించాలని డబ్బు జమను బట్టి పాన్ – ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. ఖాతా తెరిచిన అనంతరం 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుంది. ఈ కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చు. పెద్ద నగరాల్లో అయితే పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ – ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంది.