దేశంలో ఆదాయం పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం అన్నారు. స్వరాష్ట్రంలో బాగుపడుతామనే తెలంగాణ సాధించుకున్నమని సీఎం స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన బీసీలతో జనహిత కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మహారాష్ట్ర, గుజరాత్ కంటే 21శాతం ఆదాయం పెరుగుదల తెలంగాణలో ఉందన్నారు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బడ్జెట్ ఎక్కువన్నారు.
తెలంగాణలో ఉన్న ప్రతీ కులం, ప్రతీ మనిషీ చిరునవ్వుతో జీవించాలని సీఎం అన్నారు. గొర్రెలను, చేపలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. యాదవులకి 88లక్షల గొర్రెలు ఇస్తున్నమని సీఎం తెలిపారు. రెండేళ్లలో తెలంగాణలో 4కోట్ల గొర్రెలుంటాయని సీఎం వెల్లడించారు. సంపద సృష్టించే శక్తి యాదవులకు, ముదిరాజ్‌లకు ఉంది. చేనేత అభివృద్ధికి రూ.1200 కోట్లు కేటాయించామని అన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో గంగపుత్రుల జనాభా మొత్తం 3.5లక్షలు కూడా లేదని సీఎం తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, జిల్లాల్లో ముదిరాజ్‌లు లేరని, ఇతరులే చేపలు పడతారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 90శాతం మంది ముదిరాజ్‌లు చేపలు పడతారని సీఎం వెల్లడించారు. ముదిరాజ్‌లు, బెస్త సోదరులు వివాదాల జోలికి వెళ్లవద్దని సూచించారు.
అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం పునరుద్ఘాటించారు. చేపలు పెంచే హక్కు పూర్తిగా మత్స్యకారులకే ఉంటుందన్నారు. మత్స్యకారులకు హక్కులు ఉండే విధంగా చట్టం తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. మొత్తం పది లక్షల కుటుంబాలను ఇందులో సభ్యులుగా చేస్తామని వెల్లడించారు. చేపల విత్తనాల కేంద్రాలు, మార్కెట్లు ఏర్పాటు చేస్తమని తెలిపారు. రాష్ట్రంలో ఫిష్ కల్చర్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.