శుక్రవారం జగిత్యాల జిల్లాలో మన ఊరు/మన బస్తీ మన బడి కార్యక్రమం అమలుపై కలెక్టర్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ తో కలిసి జూమ్ ద్వారా మంత్రి రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం విద్యా వైద్య రంగాలపై అధిక శ్రద్ధ వహిస్తుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.7600 కోట్లు మంజూరు చేసి మన ఊరు మన బడి కార్యక్రమం రూపొందించారని మంత్రి పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 అంశాల్లో పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రహారి గోడ, కిచెన్ షెడ్డు, డిజిటల్ విద్య, నీటి సదుపాయంతో టాయిలెట్స్, త్రాగునీటి సౌకర్యం, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచర్, పాఠశాలకు పెయింట్ వేయడం, శిధిలావస్థలో ఉన్న గదులకు బదులుగా అదనపు గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మరమ్మతులు, డైనింగ్ హాల్ ఏర్పాటు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ లు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ లతో కలెక్టర్ వెంటనే సమావేశం నిర్వహించి మన ఊరు మన బడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధి కోసం దాతలను ప్రోత్సహించాలని, పూర్వ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సమాజంలో మంచి స్థానంలో ఉన్న వారి వివరాలు సేకరించి, వారిని సంప్రదించి కార్యక్రమాన్ని వివరించాలని మంత్రి సూచించారు.
జగిత్యాల జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన 274 పాఠశాలలను కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు 10 రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో విద్యార్థుల ఎన్ రొల్మెంట్ అధికంగా ఉండి, మొదటి జాబితాలో చోటు దక్కని పాఠశాలల వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ రేటు పెరిగిందని, విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సొంత కార్యక్రమం భావించి పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి దశలో 274 పాఠశాలలో ఎంపిక చేశారని, ధర్మపురి నియోజకవర్గంలో 73 పాఠశాలలు, జగిత్యాల నియోజకవర్గంలో 75 పాఠశాలలు, కోరుట్ల నియోజకవర్గంలో 64 పాఠశాలలు, చొప్పదండి నియోజకవర్గంలో 28 పాఠశాలలు, వేములవాడ నియోజకవర్గం లో 34ను గుర్తించారని తెలిపారు.మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక బ్యాంక్ ఖాతా, ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 2 నూతన బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహిస్తామని, ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ లక్ష్యం సాధించే దిశగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పాఠశాల పరిస్థితులను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.జగిత్యాల బాలికల ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల, బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల గ్రౌండ్ కు ఇరువైపులా ఉంటాయని, 2 జూనియర్ కళాశాలలో సైతం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన 64 పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. మెట్ పల్లిలో జూనియర్ కళాశాల నిర్మాణ పనులు సగంలో ఆగిపోయాయని, తాను విద్యనభ్యసించిన ఉన్నత పాఠశాల సైతం శిథిలావస్థ స్థితిలో ఉందని, వాటి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు.
టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు మనబడి కార్యక్రమం కింద గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు వినియోగిస్తూ గ్రౌండ్ లెవెలింగ్ పనులు చేపట్టాలని సూచించారు.ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల రెండింటిలో పనులు చేపట్టాలని ఎమ్మెల్సీ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పెర్సన్ శ్రీమతి దావా వసంత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ , జిల్లా విద్యాశాఖ అధికారి , జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.