బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్..

116
bandi sanjay
- Advertisement -

తెలంగాణలో బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..ఓ పక్క విభజన హామీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన దగాపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉమ్మడి ఓరుగల్లు ప్రజలు పోరుబాట పట్టనున్నారు. మరోవైపు అదిలాబాద్‌లో సీసీఐ తెరిచివేత కోసం ఇప్పటికే ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. విభజన హామీల్లో ఒకటైన గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై గిరిజనులు పోరుబాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

సింగరేణి బొగ్గు గనుల వేలంపై ఇప్పటికే కార్మికులు కోల్‌మైన్స్ ఏరియాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి చీకటి ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను ఏపీలో కలిపేసిన మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా భద్రాద్రిలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో విలీనం చేసిన తమ 5 గ్రామపంచాయతీలను మళ్లీ తెలంగాణలో కలిపేయాలంటూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో విలీన గ్రామాల ప్రజలు చేపట్టిన భద్రాద్రి బంద్ విజయవంతమైంది. తమను తెలంగాణలో కలిపేంతవరకు మరో ఉద్యమం చేస్తామని విలీన గ్రామాల ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఇక తాజాగా అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీసీఐ సాధన కమిటీ 44వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించింది. పట్టణ శివారు ప్రాంతంలోని జందాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో నాగ్‌పూర్, హైదరాబాద్‌ రోడ్డు మార్గాల్లో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మూత పడిన సిమెంట్‌ ఫ్యాక్టరీని తెరిపించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన హన్స్‌రాజ్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

అలాగే 2018 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్‌ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని బీజేపీ ఎంపీలు సోయంబాపురావు, అర్వింద్, బండి సంజయ్‌లు కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు బాపురావు, బీజేపీ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీసీఐని తెరిపించేవరకు కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని సాధన కమిటీ సభ్యులు తేల్చిచెబుతున్నారు. మొత్తంగా అదిలాబాద్ నుంచి భద్రాద్రి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఊపందుకోవడంతో తెలంగాణలో బండి బ్యాచ్‌కు ఇక బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే అని రాజకీయవర్గాలు అంటున్నాయి.

- Advertisement -