త్వరలో కొత్త జతీయ పార్టీ రానుందని తెలిపారు సీఎం కేసీఆర్. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ అని పిలుపునిచ్చారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త జాతీయ పార్టీ పెడతామని ప్రకటించారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు.
తాను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా అందరూ నవ్వారని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు నవ్విన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నీటిబొట్టు.. అంతకాదు అన్నారు.. మరి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని.. చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే ఆరేళ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది. 11 శాతం ఉంటే ఏడేళ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతాడు… మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి అని కేసీఆర్ సవాల్ విసిరారు.