సింగరేణిని ప్రైవేటీకరించాలని బీజేపీ చూస్తోందని అలా చేస్తే ఆ పార్టీపై యుద్ధం ప్రకటిస్తామన్నారు మంత్రి కేటీఆర్. సింగరేణి జోలికి వస్తే ఢిల్లీ తల్లడిల్లాల్సిందే అని, తేల్చిచెప్పారు. సింగరేణి కోల్ మైన్ కాదు.. గోల్డ్ మైన్ అని పేర్కొన్న కేటీఆర్…ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.
సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానంలో దూసుకెళ్తున్నదని మంత్రి తెలిపారు.