మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు బహిరంగలేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్నికల సమయంలో హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు…కానీ కనీసం కాలుష్యం లేని నగరంగా కూడా చేయలేక పోయారన్నారు. మహానగరం సంగతి అటు ఉంచితే కనీసం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మీ హామీ నెరవేరలేదన్నారు.
మూడేళ్ళ క్రితం ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పిన మీ హామీ ఇంతవరకు నెరవెరలేదన్నారు. కల్వకుంట్ల వారి మాటలు కోటలు దాటుతాయ్ కానీ పనులు గడప దాటవన్న నానుడి మరోసారి రుజువు చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల విష వాయువులు వెలుబడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని మీకు జాయింట్ అక్షన్ కమిటీ అనేక సార్లు చెప్పిందన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు మీరు ఇచ్చిన హామీని సైతం పక్కన పెట్టి మొద్దు నిద్ర పోతున్నారు…ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, అద్భుత ప్రపంచాలు కోరుకోవడం లేదన్నారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోరుకుంటున్నారు… అవి కూడా ఇవ్వలేని మీరు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే జవహర్ నగర్ డంప్ యార్డ్ ను తరలించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు.