తిరుపతి శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మాణం దాదాపుగా పూర్తి అయిన శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన నంది సర్కిల్ సమీపం నుంచి శ్రీనివాసం సర్కిల్ వరకు వారధి మీద ప్రయాణించారు. తుది దశలో ఉన్న పనులను పరిశీలించి ఆఫ్కాన్ సంస్థ అధికారులతో మాట్లాడారు. వారధి మీద ఏర్పాటు చేసిన ఫైబర్ సిగ్నల్స్‌ను పరిశీలించారు.
అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారధి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయించాలని పలు మార్లు ముఖ్యమంత్రిని కోరారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నిర్మాణం పనులు వేగవంతం చేసి తొలివిడతగా శ్రీనివాసం నుంచి నంది సర్కిల్ వరకు వారధి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ వారధి ప్రారంభమైతే అటు భక్తులు, ఇటు తిరుపతి స్థానికులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని సుబ్బారెడ్డి తెలిపారు. ఆఫ్కాన్ ప్రాజెక్ట్ మేనేజర్ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.