ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. కొన్ని సంస్థలు బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని చెప్తే.. మరికొన్ని మాత్రం అతిపెద్దపార్టీగా అవతరిస్తుందంటూ గణాంకాలు వెల్లడించాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణకు, ఆయన చేపట్టిన సంస్కరణల పట్ల ప్రజల మద్దతుకు అద్దంపడుతాయని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వ ప్రతిభకు యూపీ ఎన్నికలూ గీటురాయిగా నిలుస్తాయని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో లభించే సానుకూల ఫలితాలు రాజ్యసభలో పార్టీ బలాన్ని పెంచుతాయి. ఇదిలా ఉండగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేడు(శనివారం) సాయంత్రం దిల్లీలో భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంకానుంది.
అప్పటికి కీలకమైన యూపీ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి కనుక పరిస్థితిని సమీక్షించి ఆ తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ శనివారం సమావేశం కాకుంటే ఆదివారం భేటీ అవుతారని భాజపా వర్గాలు తెలిపాయి.