కాషాయపార్టీలో కుమ్ములాటలు..!

142
bandi
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాషాయపార్టీలో సంచలనంగా మారింది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీలో మరో వర్గం తయారైంది. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన తర్వాత వరుసగా జిల్లాల టూర్‌లు చేస్తూ తమపై పెత్తనం చేయడాన్ని మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న కాషాయ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతే కాదు బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తూ… మొదటి నుంచి వస్తున్న పాత కాషాయ నేతలను పక్కనపెడుతున్నారంటూ ఆరోపిస్తూ.. కరీంనగర్‌లో 100 మందికి పైగా కాషాయ సీనియర్లు రహస్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్త నేతలను ఏకం చేసి తిరుగుబాటు చేయాలని నిర్ణయించారు. అయితే కరీంనగర్‌లో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా రెండు జిల్లాల నేతలు నిర్వహించిన భేటీపై హైకమాండ్ ఫుల్ సీరియస్ అయింది. వెంటనే ఈ విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఈ రహస్య సమావేశం ఆంతర్యం ఏంటీ…బండిపై తిరుగుబాటు చేసిన సీనియర్ల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరనే విషయాన్ని తేల్చే బాధ్యతలను బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించింది. పార్టీ లైన్ దాటి వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను కూడా పూర్తిగా నల్లుకే అప్పగించారంట.. అధిష్టానం ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన ఇంద్రసేనారెడ్డి తక్షణమే కరీంనగర్‌‌లో రహస్య సమావేశం నిర్వహించిన నేతలందరిని హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. బీజేపీ నేతల రహస్యభేటీలో ఏం జరిగిందనే విషయమై ఆరా తీశారంట..ఈ సందర్భంగా అసంతృప్త నేతలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారంట..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత సీనియర్లను విలువ లేకపోవడం, ముఖ్యంగా ఈటల రాజేందర్ జిల్లాల టూర్లు చేస్తూ తమపై పెత్తనం చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారంట..కాగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలతోనే కాషాయ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని కిషన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వర్గాలుగా చీలిపోయింది.

ఈటల వర్గం తమ నాయకుడికి వ్యతిరేకంగా కుట్ర చేస్తుందని బండి వర్గీయులు ఆందోళన చేస్తున్నరు. ఇక కిషన్ రెడ్డి వర్గం… బండి, ఈటల వర్గాలతో సీనియర్లకు పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆరోపిస్తోంది. మొత్తంగా ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు …కాషాయ పార్టీలోకి ఎంటరయ్యాయి. మున్ముందు మూడు వర్గాల మధ్య కుమ్ములాటలతో కాషాయ పార్టీ పని ఖతం అవడం ఖాయమని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -