ఉపాధ్యాయుల బదిలీల లో తీవ్ర అభ్యంతరకరంగా మారిన జిఓ 317 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సోమవారం శ్రీనగర్కాలనీలోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉదయం ఏడుగంటలకి మంత్రి నివాసం వద్దకు చేరుకుని ఆమె కోసం నిరీక్షించారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు మంత్రి నివాసం వద్దకు చేరుకోవడంతో బంజారా హిల్స్ పోలీసులు అని అదుపులోనికి తీసుకొని స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్థానికతను పరిగణలోనికి తీసుకోకుండా చేస్తున్న బదిలీల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు . సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సంబంధం లేని వ్యక్తులను ఇతర జిల్లాలకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా చేపట్టిన బదిలీల కుటుంబాలు విశ్చినం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న జిల్లాలో ఎలాంటి గ్రామీణ ప్రాంతానికైన వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా చేస్తున్న నిరసన పోలీసులు అడ్డుకోవడం విచారకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.