సిరివెన్నెల మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు- ఉపరాష్ట్రపతి

184
- Advertisement -

సిరివెన్నెల మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సంతాప సందేశం పంపారు. తెలుగు పాటను విలువల పల్లకిలో ఊరేగించిన తెలుగు సినీ గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు మాటలను పాటలుగా కూర్చి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. తెలుగు పాటకు విలువలను అద్ది, నలుగురికీ నచ్చే విధంగా, పదిమంది మెచ్చే విధంగా రాయడంలో వారు సిద్ధ హస్తులు. తెలిసిన మాటలనే గాక, తెలుసుకోవాలనిపించే మాటలను కూడా పాటల్లో అందంగా అల్లే సిరివెన్నెల దివికేగడం తెలుగు పాటకే గాక, తెలుగు సాహిత్యానికి సైతం తీరని లోటు.

2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. శ్రీ సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, ఎప్పటికప్పుడు కిమ్స్ వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సిరావడం విచారకరం. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలపారు.

- Advertisement -