ధరణి పోర్టల్‌లో అదనంగా మరిన్ని మాడ్యూల్స్..

193
- Advertisement -

ధరణి పోర్టల్లో మరిన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో చాలా సమస్యలకు పరిష్కారం దొరకనుంది. పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములను సుమోటాగా తొలగించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన నగదు మొత్తాన్ని కూడా యజమానులకు తిరిగి చెల్లించే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

ధరణిపోర్టల్లో మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. అందులో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కొన్ని మాడ్యూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా కూడా కొన్ని రైతులకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. పేర్ల ముద్రణలో తప్పిదాలు, సర్వే విభాగాల్లో పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తప్పుగా నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లడం, తదితర సమస్యలింకా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కొద్దిరోజులుగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే అధికారులతో సమాలోచనలు సాగిస్తోంది. దఫదఫాలుగా సమావేశమై సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ పై అవగాహన కల్పించడంతో పాటు అదనంగా మరిన్ని మాడ్యూల్స్ ను రూపొందించాలని అధికారులను కమిటీ ఆదేశించింది.

అందుకనుగుణంగా మరో ఐదు, ఆరు మాడ్యూల్స్ ను స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్టీఎస్ కలిసి సంయుక్తంగా రూపొందించాయి. ఐతే ఇవింకా పరిశీలన దశలోనే ఉన్నాయి. వచ్చే సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రానున్నాయి. ఈ మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న సమస్యలు 75 నుంచి 80 శాతం వరకు పరిష్కారమవుతాయని ప్రభుత్వం అంచనా. దీంతో భూలావాదేవీలకు సంబంధించిన సమస్యలు దాదాపుగా సమసిపోతాయని భావిస్తున్నారు. అటు నిషేధిత భూముల జాబితాలో పొరపాటున చేరిన వాటిని పరిష్కరించాలని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. విజ్ఞప్తులు, ఫిర్యాదుల కోసం చూడకుండా కలెక్టర్లు సుమోటోగా వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి సమస్యలు చాలా వరకు ఇప్పటికే పరిష్కారమయ్యాయని, ఒకటి, రెండు రోజుల్లో మొత్తం పూర్తవుతాయని ప్రభుత్వవర్గాలంటున్నాయి.

ఇక భూలావాదేవీలకు సంబంధించి రైతులు చెల్లించిన క్యాష్ వివిధ కారణాల వల్ల ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ చెల్లింపులపై ఇప్పటికే రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. రైతులకు ఆ మొత్తాలు వాపస్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. రెండు, మూడు రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘం ఇంకో సమావేశం జరగనుంది. మాడ్యూల్స్ ను పరిశీలించి ఆమోదం తెలపడంతో పాటు, కమిటీ తరఫున ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -