కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ దురుద్దేశంతో రాద్ధాంతం- మంత్రి ఎర్రబెల్లి

57
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడటానికి నిధులు, అధికారాలు పెంచడమే కాకుండా గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సంఘం సభ్యుల బాధ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని విజ్ఞాపన సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం నెలసరి గౌరవ వేతనం జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ వేతనం 7500 రూపాయలు ఉండగా, ప్రస్తుతం ఒక లక్ష రూపాయలకు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా జడ్పీటీసీల గౌరవ వేతనం 2250 రూపాయల నుండి 13వేలకు, ఎంపీటీసీల గౌరవ వేతనం 750 రూపాయలు నుండి 6500 రూపాయలకు, గ్రామ సర్పంచ్ ల గౌరవ వేతనం ఒక వెయ్యి రూపాయల నుండి 6500 రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. బిజెపి పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లో 1750 రూపాయలు, కర్ణాటకలో 3వేల రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 3500 రూపాయలు మాత్రమే నెలసరి గౌరవ వేతనం చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు.

అదేవిధంగా బ్లాక్ (పంచాయతీ సమితి స్థాయిలలో) మధ్యప్రదేశ్ 7 వేలు, కర్ణాటకలో 6 వేలు, ఉత్తరప్రదేశ్‌లో 9500 రూపాయలు మాత్రేమే గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ లకు మధ్యప్రదేశ్‌లో కేవలం 11 వేల రూపాయలు, కర్ణాటకలో 35 వేల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 14500 రూపాయలు మాత్రమే నెలసరి గౌరవ వేతనం ఇస్తున్నారని మంత్రి చెప్పారు. జిల్లా, మండల పరిషత్తులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా ప్రజాపరిషత్ లకు 5 శాతం, మండల పరిషత్ లకు 10 శాతం నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి దయాకర్ రావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ లకు 258 కోట్లు, మండల పరిషత్ లకు 242 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి కూడా 5లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా 2020-21 సంవత్సరంలో 63 లక్షల 85 వేల రూపాయలు 2021-22 సంవత్సరంలో 2 కోట్ల 84 లక్షల రూపాయలు చిన్న గ్రామాలకు మంజూరు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా 2019-20 నుండి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కి సమానంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడ విడుదల చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని జెడ్పిటిసి, ఎంపీటీసీ లకు నిధులు అధికారాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సమైక్యాంద్ర రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని తెలిపారు . 2018 సంవత్సరంలో రూపొందించిన నూతన పంచాయతీ రాజ్ చట్టం వల్ల రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు రాజకీయ దురుద్దేశంతో ఎంపీటీసీల, జెడ్.పి.టి.సి ల అధికారాలు, బాధ్యతలపై, నిధుల కేటాయింపుపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు మున్నగు ప్రధానమైన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. ఎంపీటీసీ, జెడ్.పి.టి.సి ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇప్పటికే తమ సమస్యలు కొన్ని పరిష్కారమయ్యాయని మిగతా తమ విజ్ఞాపనలు పరిష్కరించుటకు హామీ ఇచ్చినందుకు, ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపిటిసి సంఘ బాధ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఎం.పి.టి.సి ల సంఘం అధ్యక్షుడు గడల కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అందె యాకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, వైస్ ప్రెసిడెంట్ పల్లె వెంకన్న ఇతర యం.పి.టి.సి సంఘ రాష్ట్ర భాద్యులు, జిల్లా స్థాయి సంఘ భాధ్యులు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు.

- Advertisement -