కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీష్‌ ఫైర్‌..

91
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..అబద్దాలు మాట్లాడటంలో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిమ్స్ మెడిక‌ల్ కాలేజీకి రాష్ట్ర ప్ర‌భుత్వం స్థ‌లం ఇవ్వ‌లేద‌ని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించ‌డాన్ని హ‌రీష్‌ రావు త‌ప్పుబ‌ట్టారు. గురువారం తెలంగాణ‌లో భ‌వ‌న్‌లో మంత్రి హ‌రీష్‌ రావు మీడియాతో మాట్లాడారు.

మెడిక‌ల్ కాలేజీల విష‌యంలో కిష‌న్ రెడ్డి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ మెడిక‌ల్ కాలేజీకి రాష్ట్రం స్థ‌లం ఇవ్వ‌లేద‌ని కిష‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎయిమ్స్ మెడిక‌ల్ కాలేజీకి బిల్డింగ్‌ను కేటాయించిన చ‌రిత్ర తెలంగాణ ప్ర‌భుత్వానిదే అని హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు. 20 జ‌న‌వ‌రి 2015న బీబీ న‌గ‌ర్ నిమ్స్‌ను ఎయిమ్స్ ఆస్ప‌త్రికి కేటాయించాం. భ‌వ‌నంతో పాటు 201 ఎక‌రా 24 గుంట‌ల‌ భూమిని కూడా ఏడాదిన్న‌ర క్రితం కేటాయించాం. మెడిక‌ల్ కాలేజీలు, ఎయిమ్స్ విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం చేసిన కిష‌న్ రెడ్డి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పి హుందాత‌నాన్ని కాపాడుకోవాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. కిష‌న్ రెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. చిత్త‌శుద్ది ఉంటే మెడిక‌ల్ కాలేజీల‌కు, ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేయించండి. కేంద్ర మంత్రి అయ్యాక కిష‌న్ రెడ్డి బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వ‌లేదు. కేంద్రం మొండి చేయి చూపినా రాష్ట్రంలో కొత్త‌గా వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. 21 మెడిక‌ల్ కాలేజీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలో 5 నుంచి 21 మెడిక‌ల్ కాలేజీల‌కు చేరుకున్నాం. తెలంగాణ‌కు ఎయిమ్స్ ఇవ్వాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో ఉంది. దాన్ని తుంగ‌లో తొక్కారు. బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌లేదు. ఇది ఏర్పాటైతే స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. గిరిజ‌న యూనివ‌ర్సిటీని, నవోద‌య విద్యాల‌యాల‌ను రాష్ట్రానికి ఇప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఎస్సీల‌పై ప్రేమ ఉంటే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను చేప‌ట్టాలి. బీసీల జ‌న‌గ‌ణ‌న చేయించాల‌ని కిష‌న్ రెడ్డిని కోరుతున్నాం అని హ‌రీశ్‌రావు అన్నారు.

వ‌డ్ల కొనుగోలు విష‌యంలో బీజేపీ నాయ‌కుల ప్ర‌వ‌ర్త‌న‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వ‌డ్లు కొన‌వ‌ద్ద‌ని చెప్పింది బీజేపీ పార్టీ.. వ‌డ్లు కొనాలి అని మాట్లాడుతున్న‌ది కూడా బీజేపీ పార్టీనే. దీన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు.. సిగ్గుప‌డుతున్నారు అని మంత్రి తెలిపారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రం రూ. 5 వేలు ఇస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు చెప్తే స‌వాల్ చేశాను. ఒక్క‌రూ కూడా రాలేదు. గ్యాస్ సిలిండ‌ర్ల‌పై రాష్ట్రం వ్యాట్ విధిస్తుంద‌ని అంటే చాలెంజ్ వేశాను. బీజేపీ నాయ‌కులు రాలేదు. సిలిండ‌ర్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాట్ విధించ‌డం లేదు. గోబెల్స్ ప్ర‌చారానికి బీజేపీ పాల్ప‌డుతోంది. రైతుల నుంచి బీజేపీకి మ‌ద్ద‌తు లేదు. రాష్ర్ట ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాల హ‌క్కుల‌ను అమ‌లు చేయించాల‌ని బీజేపీ నేత‌ల‌ను డిమాండ్ చేస్తున్నాను. ఎన్సీడీసీ కోసం నాలుగైదు స్థ‌లాల‌ను చూపించాం. ఐసీఎమ్ఆర్‌లో ఎన్సీడీసీ కోసం మూడు ఎక‌రాల‌ స్థ‌లం కావాల‌ని అడిగితే కేంద్రం నుంచి స్పంద‌న లేదు.. బీజేపీ అబద్దాలు ఎల్ల కాలం నిలవవు ..ప్రజలు బీజేపీ అబద్ధాలను నమ్మే స్థితి లో లేరు అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -