సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. నిత్యామీనన్ సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రం 1979లో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 1న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ తెలిపారు.
1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం అని నిర్మాత వెల్లడించారు.