హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని తేలిపోయింది. ఉప ఎన్నికల్లో తనకు దళితులు ఓట్లేయరని ఫిక్స్ అయిన ఈటల బీజేపీ నేతలతో కలిసి దళితబంధుపై కుట్రలు పన్నాడు. ఏకంగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖ రాసి దళితబంధును ఆపేయించాడు. ఈటల రాసిన లేఖతో దళితబంధు నిలిచిపోవడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు దళితుల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. తమ నోటికాడి బుక్కను లాక్కున్నాడంటూ దళిత సోదరులు ఈటల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఈటల దిష్టిబొమ్మల శవయాత్రలు, చావుడప్పులతో మారుమోగాయి. వీణవంకలోని కరీంనగర్-జమ్మికుంట రహదారిపై 500 మందికిపైగా దళితులు బైఠాయించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్ వద్ద మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మండలంలోని 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు.. హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ఈటల శవయాత్రను నిర్వహించారు. చల్లూరు, రెడ్డిపల్లి, వల్భాపూర్, కందుగుల, కనుకులగిద్దెలోనూ ఈటల శవ యాత్రలు నిర్వహించారు. జమ్మికుంటలోని అంబేద్కర్ కాలనీతోపాటు ధర్మారంలో ఈటల దిష్టిబొమ్మలు దహనం చేశారు. జమ్మికుంట మండలం మాచనపల్లిలో ఈటల దిష్టిబొమ్మకు కాష్టం పేర్చి దహనం చేశారు. ఇల్లందకుంటలో జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను, కన్నూరులో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఒక్క హుజురాబాద్‌లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈటలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రగిలాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా మధిరలో దళిత సంఘాల నేతలు బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దళితులు బాగుపడటం ఇష్టం లేని ఈటల రాసిన లేఖ ఆధారంగానే హుజూరాబాద్‌లో దళితబంధు నిలిచిపోయిందని మండిపడ్డారు. ఈటలకు చావుడప్పు కొట్టి, హుజురాబాద్‌లో బీజేపీని బొందపెట్టి తీరుతామని దళితులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా దళితబంధును అడ్డుకుని ఈటల రాజేందర్ తన గొయ్యి తానే తీసుకున్నాడని, ఇక ఆయన రాజకీయ జీవితం సమాధి అయినట్లే అని హుజురాబాద్‌లో చర్చ జరుగుతోంది.