నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు. అని ప్రశంసించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, ఆనాడు విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్ తెలిపారు.
ప్రజా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని, విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల గొంతుగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించిందని ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. అప్పట్లో నర్సింహులు విద్యుత్‌శాఖ మంత్రిగా ఉండగా తనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పారని, ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడ్డది. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా సేవలందించారు.
ఒకానొక దశలో తెలంగాణ సమాజం చెదిరిపోయింది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. అనేక అవమానాలను తెలంగాణ సమాజం ఎదుర్కొన్నది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా అనేక భయభ్రాంతులకు గురి చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ వద్ద మంచినీళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితి. మంచినీల్లు రావు, కరెంట్ సమస్య.. ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.