చాలా విషయాల్లో బైలాస్ మారుస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్యానల్ సభ్యులు మాదాలరవి, శివబాలాజీ, బాబూ మోహన్ పాల్గొన్నారు. తిరుమల దర్శనం బాగా జరిగిందని తెలిపారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. పెద్దల అంగీకారంతో చాలా విషయాల్లో బైలాస్ మారుస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని, అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు.