తెలుగు వారికి రక్షణగా ‘టాటా’

214
Telangana American Telugu Association 2nd Board Meeting
- Advertisement -

అమెరికాలో హెచ్చు మీరుతున్న జాతి విద్వేషం నేపథ్యంలో అక్కడున్న తెలుగు సంఘాలు తెలుగువారిని అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్న దాడుల నుంచి ముఖ్యంగా తెలంగాణ వారిని రక్షించేలా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు తీర్మానించారు. మంగళవారం అమెరికాలోని వర్జీనియాలో బోర్డు కమిటి సమావేశం నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆచార సాంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ సంఘం పనిచేస్తుందని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఏప్రిల్‌ 29న రెండో వార్షికోత్సవ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తీసుకోవాల్సిన ప్రణాళికలను ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న దాడులను ఖండించి ఇటీవల కాన్సస్‌లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఇంజినీర్ శ్రీనివాస్‌ మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం వ్యక్తం చేసినట్లు మీడియా ఇన్‌చార్జి బండ ఈశ్వర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మల్లారెడ్డి, ఝాన్సీరెడ్డి, విజయ్‌పాల్, సుధాకర్, శ్రీనివాస్, రవీందర్, వంశీరెడ్డి, శరత్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -