దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది- మంత్రి ఎర్రబెల్లి

95
Minister Errabelli
- Advertisement -

ఆదివారం పాలకుర్తిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సిసి రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయితీ భవనం, రైతువేదికల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో గ్రామ పంచాయితీ భవనంను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కరోనా కష్టకాలం అభివృద్ధికి ఆటంకంగా మారింది. అయినా సీఎం కేసీఆర్ తన చాణక్యంతో అభివృద్ధి, సంక్షేమం లను ఆపలేదు. ఇంత కష్టకాలంలో కూడా దళితులకు దళిత బంధు ఇస్తున్నాం. పేదలకు ఇండ్లు ఇస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నం. అన్నారు.

కేంద్ర సహకారం లేకున్నా, సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ సహా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ప్రజల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలో లేదు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి. అన్ని గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. కరోనాను కనిపించకుండా చేయాలి. ప్రజలంతా భాగస్వాములు కావాలి. అని మంత్రి ప్రజలకు ఉద్బోధించారు. ఈ రోజు నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివాళ్లు బాధపడొద్దు. త్వరలో భూమి వున్న వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ ఇల్లు కట్టిస్తామన్నారు.

కొందరు నాయకులు రాజకీయం చేస్తూ…కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాళ్లకు అన్ని తెలుసు. రైతు వేదికలు రైతులను సంఘటిత పరుస్తోంది. సీఎం కేసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజును చేశారు. ఎవరూ ఊహించని దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులకు ఆరాధ్య దైవంగా కేసీఆర్ మారారు. ఊరిలో నిజమైన పేదోల్లు దళితులు అందుకే వాళ్లకు 10 లక్షలు ఇస్తున్నాం. ముందుగా దళితులు, తరువాత ఎస్టీలు, బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాం అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

కరోనా వల్ల మనం చాలా నష్టపోయాం అయినా అందరికీ పథకాలు అందిస్తున్నాం. గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు అందరూ ఉపయోగించుకొని కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -