క్రీడా సంఘాలు మరింత బలోపేతం కావాలి..

168
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌తో పాటు వివిధ క్రీడాంశాల నుంచి ఆటగాళ్లను ప్రాతినిథ్యం వహించేలా కృషి చేసిన క్రీడా సంఘాలకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) ప్రత్యేక గ్రాంట్‌ను అందించింది. ఒలింపిక్స్‌కు క్రీడాకారులను అందించిన ఒక్కొక్క క్రీడా సంఘానికి రూ.25 లక్షల చొప్పన ఢిల్లీలోని ఐఓఏ ప్రధాన కార్యాలయంలో చెక్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు తేజం, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్‌ రావు చేతుల మీదగా క్రీడా సంఘాలకు చెక్‌లు అందించడం విశేషం.

ఈ సందర్భంగా జగన్మోహన్‌ రావు మాట్లాడుతూ.. దేశంలో క్రీడా రంగం అభివృద్ధి చెందాలంటే ముందు క్రీడా సంఘాలు అన్ని విధాలా మ‌రింత‌ బలోపేతం కావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఐఓఏ తీసుకుంటున్న విప్లవాత్మకమైన చర్యలను ఆయన కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చారని.. వారి విజయాల వెనుకాల క్రీడా సంఘాల శ్రమ కూడా చాలా ఉందని గుర్తు చేశారు.

ఈ ఒలింపిక్స్‌కు క్రీడాకారులను అందించిన సంఘాల పనితీరును స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన అసోసియేషన్లు కూడా పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్‌కు హ్యాండ్‌బాల్‌ జట్టు అర్హత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి పనిచేస్తున్నట్టు జగన్మోహన్‌ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా, కార్యదర్శి రాజీవ్‌ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -