రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ పామ్ పంటను పండించాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు అని మంత్రి అన్నారు. రాష్టంలో ప్రస్తుతం వరి ధాన్యం నిలువలు అవసరానికి మించి ఉన్నాయని అందువల్ల వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం మేలని అయన అన్నారు. ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. మొదటి నాలుగు ఏళ్లలో ఒక్కో ఎకరానికి 60వేల రూపాయల ఖర్చు వస్తుందని అయన తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు కోతులు,అడవిపందులు, రాళ్లవాన, గాలి వాన బెడద ఉండదని అయన అన్నారు. తొర్రుర్లో 150 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్నట్లు అయిన తెలిపారు. తొర్రుర్కు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం వాళ్ళ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆయిల్ ఫామ్ సాగు చేసిన ప్రతి రైతు 30 సంవత్సరాల వరకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చునని మంత్రి అన్నారు.
చెర్లపాలెం గ్రామంలో ఆయిల్ పామ్ సాగు కోసం 80 ఎకరాల భూమి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో మాదిరిగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని అయన కోరారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కూలీల ఖర్చు, శ్రమ తక్కువగా ఉంటుందని ఎలాంటి నెలలోనైనా ఈ పంటను సాగు చెయ్యవచ్చు అని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు విధిగా మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం చట్టంలోనే పొందు పరచడం జరిగిందని, ప్రతి ఏటా ఆయిల్ పామ్ ధర పెరుగుతుంది తప్ప తగ్గదని అయన అన్నారు. నాలుగు ఏళ్ల పాటు ఆయిల్ పామ్ మొక్కల మధ్య అంతర్ పంటలు వేసుకోవచ్చని అయన అన్నారు. నాలుగవ ఏడాది నుండి ఆయిల్ పామ్ పంట వస్తుందని, 30 ఏళ్ల వరకు దిగుబడి ఉంటుందని ఆయన అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కుమారి అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు జిల్లాకు గర్వకారణమని, రైతులందరూ అవగాహన కలిగి ఆయిల్ ఫామ్ సాగును చేపట్టి లాభాలు పొందవచ్చునని, పంటలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా అధికారులను సంప్రదించవచ్చని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లాలో అనువైన భూమిని లక్ష ఎకరాల వరకు గుర్తించామని ఆమె తెలిపారు. రైతులు సబ్సిడీలను వినియోగించుకోవాలని, ఆయిల్ పామ్ పంటలను పండించడంలో మెళకువలు నేర్చుకుని తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ ఆయిల్ ఫామ్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఎం.వి.ప్రసాద్ శాస్త్రవేత్త సుధీర్ రెడ్డి జనరల్ మేనేజర్, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, డీఏవో చత్రు నాయక్, సత్యనారాయణ మేనేజర్, రైతుబంధు కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, డి సి సి బి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ హరి ప్రసాద్, ఆర్డిఓ రమేష్ తహసిల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, చైర్పర్సన్ రామచంద్రయ్య , ఎంపీడీవో భారతి, ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వరి, జెడ్ పి టి సి లు శ్రీనివాస్ ,కిరణ్ మై , వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.