హ్యాపీ బర్త్ డే టు తేజ..

379
Happy Birthday to Teja
- Advertisement -

ప్రేమ, యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ, మెసేజ్‌ ఇలా అన్నికలగలిపి ఉన్న చిత్రాలు తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. సినిమా చిన్నదే ఆయన భారీ విజయం అందించడం ఖాయం. ఒక్కోసారి నిరాశ పర్చిన తనదైన మార్కుతో ప్రేక్షకులను అలరించడం మాత్రం పక్కా. ఆయనే విభిన్న చిత్రాల దర్శకుడు తేజ. ఆయన చిత్రాల్లోని సంగీతం ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. వెండితెరకు కొత్త తరం కథనాయకులను అందజేసింది ఆయనే. నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ప్రేమకథలను తీయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. తేజ అందులో సిద్ధహస్తులు. ఆయన తెరకెక్కించిన ప్రేమకథా చిత్రాలన్నీ ప్రత్యేకత చాటుకున్నవే. దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన రోజుల్లో ప్రేమకథా చిత్రాలను ఆయన తీర్చిదిద్దినట్లు మరో దర్శకుడు తీర్చిదిద్దలేదేమో. తేజ సినిమాలన్నీ దాదాపు యువతను ప్రధానంగా ఆకర్షించేవే. తొలి ‘చిత్రం’ నుంచి ఆయనది అదే పంథా. కళాశాల నేపథ్యంగా సాగిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Happy Birthday to Teja

తేజ సినిమాలన్నీ దాదాపు పరిమిత బడ్జెట్‌లోనే తెరకెక్కించినవే. ఆయన దర్శకత్వం వహించిన తొలి‘చిత్ర’మే తీసుకోండి. దాని బడ్జెట్‌ సుమారు రూ.40లక్షలు. సినిమా మొత్తాన్ని దాదాపు రామోజీఫిల్మ్‌ సిటిలోనే తెరకెక్కించారు. 2000 సంవత్సరంలో విడుదలైన ‘చిత్రం’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతీ చిత్రం బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే తీశారు. ‘నువ్వునేను’, ‘జయం’ సినిమాలన్నీ పరిమిత బడ్జెట్‌ చిత్రాలే. ఇవి కలెక్షన్ల సునామీని సృష్టించాయి.

ప్రిన్స్‌ మహేష్‌బాబుతో తీసిన ‘నిజం’ సినిమాను ఆరున్నర కోట్లతో పూర్తి చేశారు. అదీ మహేష్‌ రెమ్యునరేషన్‌తో కలిపి. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, కమర్షియల్‌గా లాభాలనే అందించింది. అంతేకాదు మహేష్‌బాబుకు ఉత్తమ కథానాయకుడిగా నంది అవార్డునూ తెచ్చి పెట్టింది. ఏ చిత్రమైనా అనవసర ఖర్చు ఉండదు.అదే తేజ ప్రత్యేకత.

Happy Birthday to Teja

తేజ సినిమా అంటే ప్రాథమిక పాఠశాలలాంటిదంటారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన పరిచయం చేసినంతమంది నటులను బహుశా మరో దర్శకుడు పరిచయం చేసి ఉండరేమో. తేజ సినిమా అంటే దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చేవట. 40వేల అప్లికేషన్‌లకుపైగా వచ్చిన ఘటనలూ ఉన్నాయట. అలా ఆయన చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైన వాళ్లూ, మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లూ చాలా మంది ఇప్పుడు స్టార్‌లు అయ్యారు. నితిన్‌, సదా, కాజల్‌ అగర్వాల్‌, నవదీప్‌, సునీల్‌, ఆది పిన్నిశెట్టి ఇలా చాలామంది ఉన్నారు. మరీ ప్రత్యేకంగా ఉదయ్‌కిరణ్‌కు స్టార్‌డమ్‌ వచ్చింది తేజ చిత్రాలతోనే.

‘చిత్రం’తో దర్శకుడిగా అవతారమెత్తిన తేజ ‘నువ్వునేను, జయం, నిజం, జై, ధైర్యం, అవునన్నా కాదన్నా, లక్ష్మి కళ్యాణం, కేక, నీకునాకు డాష్‌ డాష్‌, 1000 అబద్దాలు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సినిమాలు తీయడంలో విఫలమైన డైరెక్టర్‌ తేజ తాజాగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. ప్రముఖ దర్శక నిర్మాత, రాజకీయవేత్త అయిన కేతీరెడ్డి జగదీశ్వరరెడ్డి నిర్మాణంలో తేజ ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. తెలుగు వారి గొప్పదనాన్ని చాటేలా రూపొందే ఈ డాక్యుమెంటరీకి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’..అనే పేరు పెట్టారు. ‘చిత్రం’తో వచ్చి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు తేజ. ఇప్పుడు రానా, కాజల్‌ జంటగా కొత్త చిత్రం తెరకెక్కిస్తున్నారు.  తేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు greattelangaana మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది

Happy Birthday to Teja

- Advertisement -