తెలంగాణను చూసి ప్రపంచం గర్విస్తుంది- మంత్రి జగదీష్ రెడ్డి

121
- Advertisement -

తెలంగాణను చూసి ఇప్పుడు ప్రపంచమే గర్విస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సొంతం చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ కుటుంబ సభ్యుడిగా తెలంగాణ సమాజం ఆదరిస్తుందని ఆయన తెలిపారు. అందుకే అభివృద్ధి,సంక్షేమం సమపాళ్ళల్లో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు వెనుక ఉన్న పరిస్థితులు సోదాహరణంగా వివరించారు. 2014 కు పూర్వం ఇవే ఆహార భద్రత కార్డుల విషయంతో పాటు అప్పటి పాలకులు చేపట్టిన ప్రతి పధకంలో లోటుపాట్లు ఉండేవని ఆయన చెప్పారు. అటువంటి లోటుపాట్లు కూలంకషంగా పరిశీలించిన మీదటనే కొత్త కార్డుల మంజూరు అయ్యాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దార్శనికతకు పెట్టింది పేరు అన్నారు. తెలిసో తెలియకనో,అమాయకంగా నో లేదా రాజకీయ విమర్శల కోసమో తెలంగాణ వచ్చాక ఏమి జరిగింది అంటే ఆకలిచావులు ఆగిపోయాయని,ఆత్మహత్యలు నిలువరించ బడ్డాయని,కృష్ణా,గోదావరి వంటి జీవనదుల నుండి సురక్షితమైన నీరు త్రాగుతున్నామని చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరు ఏండ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరించాలని ఆయన కోరారు. భారతదేశం గర్వించే పద్దతిలో మిషన్ భగీరథ పథకంతో సురక్షితమైన మంచినీరు ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాయే నని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. తెలంగాణా ఏర్పాటుకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు వారానికి ఒక్కసారి వచ్చే వాటర్ ట్యాన్కర్ వద్ద జరిగే ముష్టిఘాతుకాలు ఎవరి పాలనలో జరిగియో అన్నది ఒక్కసారి యాది తెచ్చుకోవాలన్నారు.

అంతెందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయం దండగ అనే పరిస్థితులు ఏర్పడడమే కాకుండా 10 నుండి 15 ఎకరాల అసాములందరు వలసలు పోయి కూలి చేసుకున్న దుర్భర పరిస్థితులు ఇంకా కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయన్నారు.అటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా ప్రజల ఆశీసులతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి స్వర్ణయుగం సృష్టించారన్నారు.2014 కు ముందు వెనుక తేడా ఒక్క వ్యవసాయం లో మాత్రమే కాదని వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా లో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే వాస్తవం బోధపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

మొత్తం సూర్యపేట జిల్లాలో 9,373 మంజూరు కాగా సూర్యపేట నియోజకవర్గానికి 2,578,తుంగతుర్తి 1542,కోదాడ 2305,హుజుర్నగర్ కు 2939 మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, అర్.డి. ఓ రాజేంద్ర కుమార్, డి.యస్. ఓ విజయ లక్ష్మి, డి.యం. రాంపథి నాయక్, తహశీల్దార్ వెంకన్న, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిదులు తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -