క్యూట్ క్యూట్ మాటలతో.. చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది సమంత. అంతేకాదు సమంత ఎంత సుకుమారంగా కనిపిస్తుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకుల్లో సమంత అంటే అందంతో పాటు చిట్టి చిట్టి మాటలతో సిత్రాలు చేసే సుందరి అనే ఆలోచన ఉంది. కానీ..సమంత ఒక్కసారిగా రుద్రరూపం దాల్చితే ఎలా ఉంటుంది? ఈ క్యూట్ సుందరి హత్యలు చేస్తూ కనిపిస్తే? వామ్మో అలా చేస్తే అభిమానులంతా ఆమడదూరం పారిపోవాల్సిందే..!
అసలు ఇదంతా చెప్పడానికి కారణం ఒక ఫొటో. ఈ అమ్మడు ట్విట్టర్లో తాజాగా షేర్ చేసిన ఫొటో చూసి అందరూ షాకైపోతున్నారు. అందులో కత్తి పట్టుకుని ఎవరినో నరకడానికి రెడీ అయిపోతున్నట్లుగా ఉంది సమంత. ఆమె ప్రస్తుతం ‘అనీతి కథైగల్’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో ఆ తరహా క్యారెక్టరే చేస్తున్నట్లుంది. అందుకే ఈ ఫొటో షేర్ చేసింది అని డిసైడైపోతున్నారు అభిమానులు. కానీ ఇది దానికి సంబంధించిన ఫోటోనా, లేక ఏదో సరదాకి సమంత ఇలా ఆ కత్తి పట్టిందా అన్నది క్లారిటీ లేదు.
తమిళంలో అనేక అవార్డులు పొందిన ‘ఆరణ్య కాండం’ అనే సినిమాతో దర్శకుడిగా త్యాగరాజన్ కుమార్ రాజా పరిచయమయ్యాడు. త్యాగరాజన్ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ దర్శకుడే ఇప్పుడు‘అనీతి కథైగల్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సమంత ఈ ఫొటో షేర్ చేస్తూ.. కుమార్ రాజా వెర్షన్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ ఇదని వ్యాఖ్యానించింది.
ఇదే క్రమంలో సమంత ఏంటి.. అలా కత్తి పట్టడం ఏంటి అంటూ జనాలు ఈ ఫొటో గురించి చర్చించుకుంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత గ్యాప్ తీసుకున్న సమంత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక‘అనీతి కథైగల్’ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.