బోనాల సాంగ్‌ వివాదం..స్పందించిన మంగ్లీ

238
mangli
- Advertisement -

బోనాల పండగ సాంగ్‌తో సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డ సంగతి తలిసిందే. ‘చెట్టు కింద కూసున్నవమ్మ.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..’ పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోండగా ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అని సంబోధించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కొంతమంది పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించారు మంగ్లీ. నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం నేను పాడిన బోనాల పాట గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు ,80 సంవత్సరాలు కలిగిన పెద్దాయన పాలమూరు రామస్వామి గారు 25 ఏళ్ళ క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది. 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారు.

ఆ పెద్దాయన రాసిన జానపదాలు నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకోవడం జరిగింది. ఈ పాట వీడియోలో రామస్వామి గారిని కూడా చిత్రీకరించాము. 300 జానపదాలతో పాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతి లోనే ఉన్నాయి.

రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము. చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా, సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. మా తాతల నాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నాము. నీకు గుడి కట్టించే ధైర్యం, పేరు నాకు ఇవ్వాలి స్వామి అని మొక్కుకున్నాను. ఆ దేవుని దయవల్ల గత ఏడాది నవంబర్ 19న నా మొక్కును తీర్చుకున్నాను. ఏనాడు గుడికి వెళ్ళని వాళ్ళు, బోనం ఎత్తని వాళ్ళు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలని పేర్కొంది మంగిలి.

- Advertisement -