తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వరంగల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటన సంధర్భంగా హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ఏ రాష్ట్రంలో జరగలేదని అన్నారు. సియం కేసిఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం సస్యశామలమైందన్నారు. ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ గారికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రజానికం కేసిఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా… రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ధాన్యం సేకరణతో పాటు, రైతు బంధు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. సియం కేసిఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ది చేసి, అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచి, బాధితులకు మెరుగైన చికిత్స అందించి, తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ను అరికట్టగలిగామని అన్నారు. రాష్ట్రంలోని భాధితులకే కాకుండా మహరాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితులకు వైద్య చికిత్స అందించామన్నారు.
వరంగల్‌ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడంలో బాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద నెంబర్ వన్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగా సువిశాలమైన 60 ఎకరాల స్థలంలో 30 అంతస్థులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈనెల 21న ముఖ్యమంత్రి గారు వరంగల్ నగరంలో శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఇక వరంగల్‌లో నిర్మించనున్న ఆసుపత్రిలో దేశంలోనే నెంబర్ వన్ వైద్య చికిత్స అందనుందని అన్నారు. వరంగల్‌లో నిర్మించిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం, పరిపాలన సౌలభ్యం కోసం నిర్మించిన వరంగల్ అర్భన్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముధాయాన్ని ప్రారంభిస్తారని అన్నారు.
బిజేపి నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది ఇష్టం లేదని, అభివృద్దిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని అడ్డుకోలేరని అన్నారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు చరిత్రలో నిలిచిపోయే విధంగా.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సెంట్రల్ జైలు ప్రాంగణంలో 30అంతస్థులతో ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రజల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు.. 30 అంతస్థులతో నూతనంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి, మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. జైలు శివారు ప్రాంతాల్లో ఉంటే ఇబ్బందులు ఏముంటాయో వ్యతిరేకించే బిజేపి పార్టీ చెప్పాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఆరాటం పడుతుంటే.. ప్రతిపక్షాలు రాజకీయ మనుగడ కోసం ఆరాట పడుతున్నాయని మండిపడ్డారు.
అందు కోసమే కేసుల పేరుతో అభివృద్దిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కేసులు వేసే వారి వెనుక ఎవరు ఉన్నారో తెలుసని అన్నారు.. అభివృద్దిని అడ్డుకునే పార్టీలు త్వరలోనే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్దికి మంచి సూచనలు చేయండి, స్వీకరిస్తాం.. కానీ ప్రజల కోసం చేసే మంచి పనులను అడ్డుకునే ప్రయత్నం చేయకండి. అభివృద్దిని అడ్డుకునే కుట్రలు చేసే పార్టీలు.. కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే బిజేపి పార్టీ, ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో డాక్టర్ బి.ఆర్.అంబెద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ల హక్కులను కాలరాస్తున్న బిజేపి, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు.
సెంట్రల్ జైలు నిర్మాణానికి మామునూరులో వంద ఎకరాలను కేటాయించామని, త్వరలోనే అక్కడ జైలు నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. భూ ఆక్రమణలు చేసేవారంతా బిజేపి పార్టీలోనే ఉన్నారని, అలాంటి పార్టీ వారు టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో అభివృద్దిలేక ఆగమైన తెలంగాణ రాష్ట్రం, సియం కేసిఆర్ నేతృత్వంలో అభివృద్ది చేసుకుంటున్నాము. రైతుల కోసం నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రెండు పంటలు సమృద్దిగా పండించి, రైతులు సంతోషంగా ఉన్నారు. అందుకు నిదర్శనం గణనీయంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తితో నిరూపణ అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరగాయని.. కేంద్రం ఇచ్చే గణాంకాలే సాక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది ఫలాలను ప్రజలు అందుకుంటున్నారని, సియం కేసిఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌పై నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పారు.
వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలపై ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుందని, అందుకు అన్ని పార్టీలు, అయా వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరెందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ లు పాల్గొన్నారు.