కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే సుమారు 5 వేల కరోన కేసులు నమోదైయ్యాయి. వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది.ప్రపంచదేశాలు కరోన కి మొకరిల్లుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకరిల్లుతున్నాయి. కరోనా తొలి దశ నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకోలేదు. కరోనా వెళ్లిపోయిందనే భ్రమలో జనం ఉన్నారు. మొదటి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకోగలిగాం. ప్రజల్లో అలసత్వం వచ్చింది. గాలి నుంచి వ్యాపించే దశకు కరోనా చేరుకుందని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు.
రాష్ర్టంలో ఎక్కడా బెడ్ల కొరత లేదని, కేవలం 15-20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. 80 శాతం మంది కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవు అని వెల్లడించారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేవలం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యిందన్నారు. నిన్న ఒక్కరోజే లక్షా 26 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 38 వేలకు పెంచామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బెడ్ల సంఖ్యను 53 వేలకు పెంచుతామని తెలిపారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు.
మహారాష్ర్ట నుంచి ఓ ఉత్సవం నిమిత్తం సరిహద్దు జిల్లాకు మార్చి 24న 20 మంది వచ్చారు. అక్కడ జరిగిన ఆ ఉత్సవంలో సరిహద్దు జిల్లాకు చెందిన మరో 30 మంది పాల్గొన్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించగా మరో 34 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలా 34 మంది 433 మందికి కరోనా వ్యాపించింది. ఇదంతా కేవలం 12 రోజుల్లోనే జరిగిపోయిందన్నారు. ప్రతీఒక్కరూ ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. జూన్ వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి శ్రీనివాస రావు తెలిపారు.