నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఉపఎన్నికలో ఆర్యవైశ్యులందరి మద్దతు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకే వుందన్నారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. గురువారం టీఎస్ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమేళన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. చరిత్రలో వైశ్యులకు ఏనాడూ లభించని ప్రాముఖ్యత ఈనాడు ఆర్యవైశ్యులకు మన ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల లభిస్తున్నది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరో, ఇద్దరో వైశ్యులు ఉన్నత పదవులలో వుండేవారు. అయితే, 15 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి, కేసిఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాక, ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి, మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి కంకణం కట్టుకున్నారు. కేసిఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల వారు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా వున్నారు. ముఖ్యంగా వైశ్యులకు ఆయన ఎప్పుడూ లేని ప్రాధాన్యతనిస్తున్నారని దామోదర్ తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత, పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఏ ప్రభుత్వమూ ఒనగూర్చని ప్రయోజనాలను తెలంగాణ ఏర్పడిన పిమ్మట కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. అంతేకాక, రాజకీయంగా ఏనాడూ గుర్తింపులేని ఆర్యవైశ్యులకు కేసీఆర్ ఎనలేని గుర్తింపునిచ్చారు. ఈ మధ్య బొగ్గారపు దయానంద్‌ను ఎమ్మెల్సీ గానూ, అమరవాది లక్ష్మీనారాయణను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గానూ, ఉప్పల శ్రీనివాస్ గుప్తను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గానూ నియమించి ఆర్యవైశ్యులు పట్ల తనకున్న ప్రేమాభిమానాలను ముఖ్యమంత్రి చాటుకున్నారు. అంతకుముందు, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 మునిసిపల్ చైర్మన్ పదవులు, ఒక వరంగల్ మేయర్ పదవి, 5 వైస్-చైర్మన్ పదవులు వైశ్యులకు లభించాయి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఒక వైశ్య సోదరునికి దక్కడం మనం గమనించవలసిన విషయం. హైదరాబాద్ మహానగర మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా వైశ్య మహిళ చీదళ్ళ రాధ ఎన్నికైనారని కోలేటి గుర్తు చేశారు.
ఇదివరకే వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడమే కాక..మొరంశెట్టి రాములుకి టిటిడి పాలకమండలి సభ్యుడుగా పదవినిప్పించారు కేసిఆర్. వైశ్యులకు వివిధ సంస్థలలో డైరెక్టర్ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అయిదుగురు వైశ్యులను నియమించారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలలో కమిటీ డైరెక్టర్లుగా వైశ్యులను నియమించారు. ప్రతిష్టాత్మకమైన సమాచార హక్కు చట్టం కమీషనర్‌గా వైశ్యుడు బుద్ధా మురళిని నియమించారు. ఈనాడు 100 మందికి పైబడి వైశ్యులు సర్పంచులుగా ఎన్నికైనారు. ఇదంతా కేసీఆర్ ప్రోత్సాహం వల్లనే జరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా, వైశ్యులు ఏనాడూ కలలో కూడా ఊహించని విధంగా ఆర్యవైశ్య భవనానికి ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేటాయించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ త్వరలో వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనతో వున్నారు. ఈ కార్పొరేషన్ వల్ల చిన్న చిన్న వ్యాపార సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేకాక బీదపిల్లలు ఇక్కడ మరియు విదేశాలలో చదువుకోడానికి కూడా ఈ కార్పొరేషన్ ఆర్థిక సాయం అందజేస్తుంది. అంతేకాక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందే ప్రయోజనాలన్నీ ఆర్యవైశ్యులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముఖ్యమంత్రి మరికొందరు వైశ్య ప్రముఖులకు కూడా ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చి, ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని మరింతగా ప్రోత్సహించే ఆలోచనలో వున్నారు.
ఆర్యవైశ్యులు ప్రధానంగా వ్యాపార వర్గాల వారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు పూర్వం మాదిరి పోలీసుల నుంచి గాని, వాణిజ్య పన్నుల శాఖ వారి నుంచి కాని ఎలాంటి వేధింపులు లేవు. అలాగే, వసూళ్ళు, చందాలు కూడా లేవు. దీనికి తోడు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నందున దోపిడీలు, దొంగతనాలు లేవు. ఇదివరకు మాదిరి అడపాదడపా బందులు, హర్తాళ్ళు, ధర్నాలు లేవు. కాబట్టి, వ్యాపారస్తులందరూ తమ వ్యాపారాలను సజావుగానూ, నిర్భయంగానూ చేసుకోగలుగుతున్నారు. 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా లభిస్తున్నందున వ్యాపారాలు, పరిశ్రమలు ఏ ఇబ్బందీ లేకుండా నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీని వల్ల వ్యాపార వర్గాల ఆదాయం పెరగడమే కాక, ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయి.
మన రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రశాంత వాతావరణం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఏ పార్టీ అధికారంలో వున్నప్పుడూ వ్యాపారవర్గాలకు ఇంతటి ప్రోత్సాహం లభించలేదు. వ్యాపారాభివృద్ధికి ప్రస్తుత వాతావరణం చాలా అనుకూలంగా వుంది. ఇన్ని కారణాల వల్ల ఆర్యవైశ్యులంతా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇంతటి ప్రోత్సాహమిచ్చిన మాన్య ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అన్నివిధాలా సహాయసహకారాలు అందించడం ఆర్యవైశ్యులందరూ తమ బాధ్యతగా గుర్తించారు. ఈ ఉపఎన్నికను ముఖ్యమంత్రికి కృతజ్ఞతను ప్రకటించుకోవడానికి తమకు లభించిన అమూల్యమైన అవకాశంగా ఆర్యవైశ్యులందరూ భావిస్తున్నారు. అందుచేత, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనడానికే, ఆర్యవైశ్యులందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని కోలేటి దామోదర్ పేర్కొన్నారు.