కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదికి సీఎం కేసీఆర్ సరికొత్త నడక నేర్పారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. హల్దీ వాగులోకి సీఎం కేసీఆర్ గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలించడం అద్భుత చరిత్రకు నాంది అన్నారు. కేసీఆర్ పరిపాలనలో జీవనది గోదావరి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందని పేర్కొన్నారు.
మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోసి సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ జలాశయానికి తరలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంజీరా నదిలోకి వచ్చే కాళేశ్వరం జలాలు నేరుగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరనుండటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తరలించడంతో పాత ఆయకట్టు స్థిరీకరణ జరిగి రైతులకు మేలు జరుగుతుందని కవిత పేర్కొన్నారు.