ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన పవన్ బిజీబిజీగా గడుపుతున్నారు. న్యూహాంప్ షైర్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ స్ధాపించినప్పుడు నాకు బెదిరింపు లేఖలు వచ్చాయని తెలిపారు. కొంతమంది ఫోన్ చేసి చంపేస్తామన్నారని … ఇంకొంతమంది బూతులు కూడా తిట్టారని వెల్లడించారు. కానీ తానెప్పుడు భయపడలేదన్నారు. తనకు జాగ్రత్త ఉందని భయం లేదన్నారు. ప్రతి రోజు చావటం కంటే ఒక్కసారే చావటం మెలన్నారు.
డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయని కానీ తనకు ఆ అవసరం లేదన్నారు. నా సొంత డబ్బులతోనే ఇప్పటివరకు రాజకీయాలు చేశానన్నారు. జనసేన పార్టీని ప్రజల కోసమే స్ధాపించానని … పార్టీ విస్తరణకు కొంత సమయం పడుతుందన్నారు.ఎరుపు సామాన్యుడి సింబల్ అని అందుకే తన భుజంపై వేసుకున్నానని తెలిపారు. తన భుజంపై వేసుకున్న కండువా గబ్బర్ సింగ్ సింబల్ కాదని కష్టపడే వాడి సింబల్ అని దీనికి మతం లేదు కులం లేదని ఇది కష్టపడే వాని గుర్తు అన్నారు. ఇష్టంతోనే తన మెడలో కండువా వేసుకున్నానని కాటమరాయుడిలో రైతు కోసం గ్రీన్ వేసుకున్నానని తెలిపారు. ఎక్కడ అన్యాయం జరిగిన ప్రజల తరపునే పోరాడుతానని స్పష్టం చేశారు.
ఒక నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సినిమాల్లో డైలాగ్‌లు చెబుతానని నిజజీవితంలో డైలాగ్‌లు చెప్పనని ఫ్యాన్స్‌కు చెప్పారు. సినిమాలంటే గౌరవమని 7 సినిమాలతో రిటైర్ మెంట్ ప్రకటిద్దామని వచ్చానని తెలిపారు. జానీ సక్సెస్ అయితే రిటైర్ మెంట్ ప్రకటించే వాడినని తెలిపారు. నాకు ఒపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తానని.. బాధ్యతలు ఎక్కువైతే కొంతకాలం దూరమవుతానేమో కానీ చేయటం మాత్రం ఆపనని స్పష్టం చేశారు. డబ్బులు అవసరం ఉంది కానీ మమకారం లేదన్నారు.