అక్కినేని నాగార్జున టైటిల్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. వరుస బాంబు దాడులతో దేశంలో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో.. ఆ టెర్రరిస్టులను తన టీమ్‌తో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా పనిచేసే విజయ్ వర్మ ఎలా తుదముట్టించాడనే కథాంశంగా తెరకెక్కింది. ‘వైల్డ్ డాగ్’తో నాగ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ:
విజయ్ వర్మ(నాగార్జున అక్కినేని) (ఎన్ఐఏ అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే ఎన్కౌంటర్ చేయడమే ఉత్తమని భావిస్తాడు. అందుకే డిపార్ట్మెంట్లో ఆయన్ని అంతా ‘వైల్డ్‌డాగ్’ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నాగ్‌కు ఎలాంటి పరిస్ధితులు ఎదురయ్యాయి..?
ఎన్ఐఏ టీమ్‌లో ఆర్యా పండిట్ (సయామీ ఖేర్)ఎందుకు జాయిన్ అవుతుంది…చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే వైల్డ్ డాగ్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నాగార్జున నటన, యాక్షన్ సీన్స్, నేపథ్య సంగీతం. దేశభక్తి గల ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగార్జున. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ జీవించింది. కొన్ని సన్నివేశాల్లో నాగార్జునతో పోటీపడి మరీ నటించింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా, విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మిర్జా , అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు రొటీన్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే బాగుండనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. యాక్షన్స్ సీన్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను ఎంచుకున్న దర్శకుడిని అభినందించాలి. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో పర్వాలేదనిపించే మూవీ.
విడుదల తేదీ:02/04/2021
రేటింగ్: 2.5/5
నటీనటులు : నాగార్జున, దియా మిర్జా
సంగీతం : తమన్
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం : అహిషోర్ సాల్మన్