తెలంగాణ శాసన సభ 2021-22 వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాలలో గౌరవ సభ్యులు రేగా కాంతారావు, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 24 వేల 543 జనావాసాలకు మిషన్ భగీరథ మంచినీరు సరఫరా జరుగుతున్నది. ఛత్తీస్ గడ్ నుంచి వలస వచ్చిన వాళ్ళతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1,514 ఆవాసాలు ఉన్నాయి. అందులో మిషన్ భగీరథ పథకం క్రింద 1,440 నివాసాలు గోదావరి పూసూరు, వైరా విభాగాలలో ఉన్నాయి. మిగిలిన 74 ఆవాసాలను విడిగా ఉండడం ఇటీవల గుర్తించాం. ఈ 74 ఆదివాసి శివారు గ్రామాల నుండి 64 గ్రామాల శివారు ప్రజలు చత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చినారు, ఈ నివాసాలన్నీ మిషన్ భగీరథ పరిధిలో ఉన్నాయి. అని మంత్రి వివరించారు.
అశ్వారావు పేట మండలములోని 8 గ్రామాలకు, ములకాలపల్లి మండలములోని 10 గ్రామాలకు, చర్ల మండలములోని 16 గ్రామాలకు, దుమ్ముగూడెం మండలములోని 5 గ్రామాలకు, లక్ష్మిదేవిపల్లి మండలములోని 3 గ్రామాలకు, పాల్వంచ మండలములోని 4 గ్రామాలకు, అశ్వాపురం మండలములోని 8 గ్రామాలకు, భూర్గం పాడు మండలములోని 7 గ్రామాలకు, కరకగూడెం మండలములోని 5 గ్రామాలకు, పినపాక మండలములోని 5 గ్రామాలకు, దమ్మపేట మండలములోని 3 గ్రామాలకు మొత్తం 74 ఆదివాసి శివారు గ్రామాలకు నీరు అందిస్తున్నట్లు మంత్రి సభకు వివరించారు.
అలాగే మిషన్ భగీరథ పథకానికి దేశ స్థాయిలో వచ్చిన అనేక అవార్డులు, కేంద్రమే జల్ జీవన్ మిషన్ పేరుతో మన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి సభకు గుర్తు చేశారు. సీఎం కెసిఆర్ రూపొందించిన ఈ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. నీతి అయోగ్ చెప్పినా, కేంద్రం నిధులు ఇవ్వలేదని, పనులు ఇంకా ప్రారంభం కానీ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు డబ్బులు విడుదల చేస్తున్నాదని చెప్పారు. పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, ఇందుకు, బీజేపీ ఎంపీలు, రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా సహకరించి, కేంద్రం ద్వారా, విజయవంతమైన మన మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇప్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.