ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు ఇప్పట్లో ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని రవాణా సంబంధిత కారణాలతో ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను కల్పించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది.
విదేశీ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను సులభతరం చేయడానికి ఎన్నికల నియమావళి 1961ని సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఈ ప్రతిపాదనపై అమలులో ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది.