దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వనున్నారు. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కొత్తమార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు, యూటీలు వీటి విషయంలో వేగంగా పెంచాలని, నిర్ణీత స్థాయి 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకోవాలన్నది. ఇంటెన్సివ్ టెస్టింగ్ ఫలితంగా గుర్తించిన వారిని ఐసోలోషన్‌లో ఉంచి వారికి సకాలంలో చికిత్స అందించాలని ఎంహెచ్‌ఏ తెలిపింది.
ప్రతిఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, నిర్ణీత దూరం పాటిస్తూనే ముక్కుకు తప్పనిసరిగా మాస్కులను వాడాలని కోరింది. టీకాల డ్రైవ్‌ను పెంచడానికి, అన్ని లక్ష్య సమూహాలను కవర్ చేయడానికి రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం సహకరించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన జరిమానాలు విధించడంతో పాటు పరిపాలనా చర్యలను తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.