ఎన్నికలకు ముందే బెంగాల్‌లో బీజేపీకి ఘోర పరాభవం..!

222
bjp
- Advertisement -

ఎన్నికల్లో ముందు, వెనుకలు చూసుకోకుండా అత్యుత్సాహానికి పోతే ఇలానే ఎదురుదెబ్బ తగులుతుంది..అవును …పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి ఎన్నికలకు ముందే ఘోర పరాభావం ఎదురైంది. పాపం మోదీ, అమిత్‌షాలకు.. పిలిచి పిల్లనిస్తానంటే..నిన్నెవరు అడిగారురా అని ఎదురు తిట్టించుకున్నట్లు అయింది. అసలు సంగతి ఏంటంటే..దేశంలో ఇప్పుడు బీజేపీ టికెట్ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. ఎమ్మెల్యే టికెట్ కోసం లక్షలు, కోట్లు పోసి కొనుక్కునేందుకు రెడీగా ఉంటారు..అలాంటి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే ఓ అభ్యర్థి తనకు వద్దని కాలదన్నడమే కాకుండా మిమ్మల్ని ఎవరు అడిగారని బీజేపీ నేతలకు క్లాస్ పీకిన ఘటన ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య గట్టిపోటీ నెలకొంది. మమతాబెనర్జీని గద్దె దించి కాషాయజెండా పాతాలని మోదీ, అమిత్‌షాలు పంతం పట్టారు. ఫోకస్ అంతా బెంగాల్‌పైనే పెట్టారు.

అయితే సీఎం మమతాబెనర్జీ టీఎంసీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేసి బరిలోకి దిగారు. మరోవైపు ఇప్పటీకే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా 157 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. కాగా అందులో కోల్‌కతాలోని చౌరంఘీ అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత కాంగ్రెస్ నేత సొమెన్ మిత్రా భార్య శిఖా మిత్ర పేరును ప్రకటించారు. అయితే తనకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై శిఖామిత్ర మండిపడ్డారు. బీజేపీ టికెట్‌ను తిరస్కరించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనుమతి లేకుండా బీజేపీ నా పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ ప్రాంతం నుంచి పోటీ చేయట్లేదు ఆమె స్పష్టం చేశారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా తన పేరును బీజేపీ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు.

అంతేకాకుండా తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసారు. దీంతో కమలనాథులకు ఊహించిన షాక్ తగిలినట్లైంది. ఎన్నికల వేళ బీజేపీకి ఇలాంటి పరాభవం ఎదురవడంపై అధికార టీఎంసీతో సహా కాంగ్రెస్, సీపీఎం ఇతర పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. తమ పార్టీలో చేరకపోయినా దివంగత కాంగ్రెస్ నేత భార్యకు టికెట్ ఎలా ఇస్తారంటూ, అన్నీ ఇలాంటి చిల్లర చేష్టలేనా..అంటూ మోదీ, అమిత్‌షాలపై ప్రత్యర్థులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నేత భార్యకు తెలియకుండానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీకి ఘోర అవమానం ఎదురైన వైనం ఇప్పుడు బెంగాల్ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -