మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు …..!

203
meghalaya
- Advertisement -

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతులపై మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా, ముఖ్యంగా పంజాబ్ రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులుగా బీజేపీ నేతలు చిత్రీకరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం తీరుపై సుబ్రహ్మణ్యస్వామి వంటి బీజేపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సిక్కు రైతుల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న తీరుపై మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు క్లాస్ తీసుకున్నారు.

సత్యపాల్ మాలిక్ మోదీ, షాలకు అత్యంత సన్నిహితుడు, తాను గవర్నర్‌గా పని చేసిన కాలంలో బీహార్, జమ్మూకాశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, బీజేపీ చిరకాల వాంఛ ఆర్టికల్ 370 ఎత్తివేతను దగ్గరుండి అమలు చేయించిన ఘటికుడు.. సత్యపాల్ మాలిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా మోదీ, షాలు ఆయనను ఇతర రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపించారే తప్ప..ఆయన్ని బహిష్కరించలేదు. అలాంటి సత్యపాల్ మాలిక్ రైతుల ఉద్యమంపై మోదీ, షాలు అనుసరిస్తున్న విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఇసుమంతైనా మేలు జరగదని, ఏ చట్టాలూ రైతులను దోపిడీ నుంచి కాపాడలేదని సత్యపాల్ మాలిక్ కుండబద్ధలు కొట్టారు.. న్యాయమైన హక్కుల కోసం రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్రం ఉక్కుపాదం మోపడం సమంజసం కాదని, అన్నదాతల ఉసురు పోసుకోరాదని మోదీ, అమిత్‌షాలకు హితవుపలికారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన మూడు నెలలుగా ఉద్యమిస్తోన్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలేవీ రైతులకు ఫేవర్ గా లేవని తేల్చిచెప్పారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని, వారిపై దమనకాండకు దిగొద్దని ఇదివరకే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరానని సత్యపాల్ మాలిక్ తెలిపారు. . ఏ దేశానికైనా రైతులు, సైనికులు చాలా ముఖ్యమైనవాళ్లు. వారిని కాపాడుకోవడం ప్రభుత్వ విధి. కిసాన్లు, జవాన్లు బాధపడే ఏ దేశమూ ప్రగతి సాధించలేదని అని గవర్నర్ వ్యాఖ్యానించారు. అందుకే నా పరిధిలో నేను రైతులకు మద్దతుగా నిలబడ్డానని అన్నారు. రైతు నేత రాకేశ్ టికాయత్ ను అరెస్టు చేయబోతున్నారని తెలిసి, ఆ పని చేయొద్దని కేంద్రాన్ని వారించిన సంగతిని ఆయన బయటపెట్టారు. రైతుల విషయంలో కావాలంటే కేంద్రంతో నేను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఇక పంజాబ్‌కు చెందిన సిక్కు రైతులను ఖలిస్తాన్ టెర్రరిస్టులుగా ముద్ర వేస్తున్న బీజేపీ నేతల తీరును గవర్నర్ ఖండించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న సిక్కు రైతులతో పెట్టుకోవద్దు..వారు తమకు జరిగే ఏ ఉదంతాన్ని, అన్యాయాన్ని అంత సులువుగా మర్చిపోరు. వాళ్లుగానీ పంతం పడితే 300 సంవత్సరాలకు కూడా వెనక్కి తగ్గబోరు. అంతెందుకు, సిక్కులతో పగ పెట్టుకున్న ఇందిరా గాంధీకే మృత్యువు తప్పలేదు. కాబట్టి సిక్కు రైతులతో తగువులు వద్దని, అందరికీ న్యాయం జరిగే పరిష్కారాన్ని చూపాలని ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను కోరారు.. సిక్కులతో పెట్టుకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి తమకు అత్యంత సన్నిహితుడైన గవర్నర్ రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలపై మోదీ, అమిత్‌షాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -