షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ ఉపకులాల నాయకులతో ఈరోజు సమావేశమైయ్యారు. మంత్రుల నివాసంలో గురువారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వారితో పాటు మంత్రి నేలపై కూర్చుని సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఉప కులాలకు తప్పక న్యాయం చేస్తాం, ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తాం, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎస్సీ ఉపకులాలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీనిచ్చారు.
ఉపకులాల వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే,కుల ధృవీకరణ పత్రాల జారీ అధికారాన్ని తహశీల్దార్లకు అప్పగించాలనే అంశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న, మినీ డైరీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి తప్పక సాయం చేస్తానని మంత్రి కొప్పుల హామీనిచ్చారు.