ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ 74వ ఎడిషన్‌లో భాగంగా ఆలిండియా రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని..తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సైన్స్‌ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డి వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించారని ప్రధాని కొనియాడారు. ఆయన సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారని ప్రధాని తెలిపారు.
ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చింతల వెంకట్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని ప్రధాని పేర్కొన్నారు.కాగా, తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త అయిన చింతల వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. ఆయన సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్ అధిక మొత్తంలో ఉండేలా ఓ వినూత్న ఫార్ములాను రూపొందించారు.