హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభమైందని చెప్పారు. 70 నుంచి 80 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ఓటింగ్ శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు.
బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్‌వర్క్ తమకు ఉందని, కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఓటేస్తే ఏం లాభమని, వారేమైనా అధికారంలో ఉన్నారా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పేరు నిషేధమని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేరును ఉచ్ఛరించేదని మంత్రి విమర్శించారు.