రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం మంత్రి పశుసంవర్ధకశాఖ అధికారుల నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యదర్శి అనితా రాజేంద్రన్, తెలంగాణ రాష్ట్ర పశు అభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ మంజువాని, డైరెక్టర్ లక్ష్మారెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన మాంసాన్ని వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. త్వరలోనే తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం విక్రయాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే మొదటి దశలో 28 వేల మంది అర్హతగల వారికి గొర్రెలను సరఫరా చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పశు సంతతిని పెంచేందుకు అనేక నూతన కార్యక్రమలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ శాఖ కృషి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ప్రశంసించారు. ఈ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం సహా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పెద్ద ఎత్తున గొర్రె పిల్లలు అందించడం, చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో ఇటు గొర్రెల సంతతి, అటు అక్వాకల్చర్ విపరీతంగా పెరిగాయన్నారు. పశుసంవర్ధక శాఖ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయన్నారు.