గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం అయ్యారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు తమ దృష్టికి తెచ్చిన సమస్యల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తగు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అదే విధంగా భూపాలపల్లి జిల్లాతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఈ నెల 6వ తేదీన బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.